అందరికీ నమస్కారం! నాకున్న జ్ఞానంతో , నాకు వచ్చిన ఆలోచనలలో నేటి రాజకీయాలను,నాయకుడి కర్తవ్యాలను కొన్నింటిని గుర్తు చేస్తున్నాను. రాజు లేని రాజ్యం, తల్లిదండ్రులు లేని బిడ్డతో సమానం అనేది నా అభిప్రాయం. మంచి, చెడ్డ చెప్పే తల్లిదండ్రులు లేక, అనాథ జీవితం ఎలా ఉంటుందో, అలాగే పరిపాలించే రాజు లేకుంటే ఆ రాజ్యం కూడా చెల్లా చెదురు అవుతుంది. అయితే పాలించే నాయకుడు అన్ని విధాలా సమర్థవంతుడై ఉండాలి. పులికి, సింహానికి పోటి పెడితే పులే గెలుస్తుంది. అన్నింటిలోనూ సింహం కంటే పులి గొప్పది.మరి అడవికి పులి ఎందుకు రాజు కాలేదు అంటే పులికి నాయకత్వ లక్షణాలు లేవు, పులి ఎప్పుడు ఒంటరి గానే ఉంటుంది. గుంపులో ఉండదు. సింహం ఎప్పుడు గుంపులో ఉండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే పులి నాయకత్వం కోల్పోయింది,సింహం అడవికి రాజు అయ్యింది. కనుక నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. వారితో కలిసి ఉండాలి, వారి మంచి, చెడ్డలు తెలుసుకోవాలి, అభివృద్దికి ఆరాటపడాలి అహర్ణిషలు కష్టపడాలి, ప్రజల గురించి ఆలోచించాలి. తన,మన అనే భేదాలు లేకుండా అందరిని ఒకేలా చూడాలి. ఆపదలను ముందుగానే అంచనా వేయాలి, ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి తిండి, గుడ్డా, విద్యా అందేలా చూడాలి, అవినీతిని అరికట్టాలి, దుర్మార్గులను శిక్షించాలి, న్యాయాన్నీ కాపాడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజలకి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలి. నిజాయితీగా ఉండాలి, ముఖ్యంగా పార్టి కార్యకర్తలను సమర్థవంతులను ఎన్నుకోవాలి ఇవన్నీ చదువుకున్న విద్యావంతుడు, జ్ఞానస్థుడే చేయగలడని నేను భావిస్తున్నా.
తండ్రి సరిగ్గా లేకుంటే, ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే నాయకుడు సరైనవారు కాకపోతే సమాజం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎలక్షన్ల సమయంలో ఇచ్చే చిల్లర డబ్బులకు ఓట్లు వేసే వారు కొంతమంది, మద్యం సీసాలకు ఆశ పడి ఓట్లు వేసేవారు కొంతమంది, మా కులం వాడు అని ఓట్లు వేసేవారు కొంతమంది. మరొక్క దౌర్భాగ్యమైన పని ఏంటంటే. హత్యలు చేసే హంతకులకు జిందాబాద్లు కొడుతున్నారు, కోట్లు కాజేసే దొంగలకు ఫ్లెక్సీలు కడుతున్నారు. దౌర్జన్యాలు చేసే గూండాలతో సెల్ఫీలు దిగుతున్నారు.మానబంగాలు చేస్తున్న మానవ మృగాలకు, పూల మాలలతో సత్కరిస్తున్నారు. మాయ మాటలు చెప్పే మోసగాళ్ళకు చప్పట్లు కొడుతున్నారు. జ్ఞానం లేని అజ్ఞానుల వెంట నడుస్తూ రాజకీయాలలోకి స్వాగతం పలుకుతున్నారు. ప్రజల ఆలోచనలు మారేంత వరకు మనకు సరైన నాయకుడు దొరకడు. యువత కూడా రాజకీయాల గురించి ఆలోచించాలి. రాజకీయలలోకి రావాలి. మనకు ఎందుకులే అని అనుకుంటే ముందు మనమే మోసపోతున్నట్లు. మనం చదువుతున్న విద్యా వ్యవస్థ సరైనది కాదు. కష్టపడి చదివిన చదువులకు ఉద్యోగాలు లేవు. 100 ఉద్యోగాలు వదిలితే 50 శాతం ఉద్యోగాలు రాజకీయ నాయకుల రెకమండేషన్స్ తోనే భర్తీ అవుతున్నాయి. ఎందులో చూసిన మోసాలు, అవినీతి. ప్రస్తుతం మనం చదువుతున్న చదువుకు భవిష్యత్తులో మనం చేసే ఉద్యోగాలకు సంబంధం లేకుండా పోతుంది. థియరీని భట్టీ పట్టాల్సిందే తప్పా దాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకోలేకపోతున్నామ్. విద్యా వ్యవస్థ మారాలి. ఉద్యోగా నియమాకాల్లో మార్పులు తీసుకురావాలి. సమాజ మార్పు యువతతోనే సాధ్యం. యువత మారాలి, సమాజాన్ని మార్చాలి. నేటి సమాజంలో మార్పులు అవసరం, అందుకుగాను నేటి నాయకుల కర్తవ్యాలను గుర్తు చేస్తూ నాకు తట్టిన కొన్ని (తొమ్మిది మార్పులు)ఆలోచనలతో మీ ముందుకు తెస్తున్నాను.
