నా చిన్నప్పుడు మాకు కొన్ని గొర్రెలు ఉండేవి.సెలవుల సమయంలో కాలిగా ఉన్నప్పుడు వాటిని తోలుకొని అడవికి వెళ్లే వాళ్ళం. అప్పుడు వాటిలో నేను గమనించిన విషయం ఏంటంటే,ఉదయం 10 గంటలకు వాటితో అడవికి వెళితే సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చే వాళ్ళం.అంటే గొర్రెలు మేత మేయడానికి పట్టే సమయం దగ్గర దగ్గరగా 8 గంటలు.మొదట 2,3 గంటలు ఆకలితో ఉండటం వలన, దేని పాటికి అది కొంచం కడుపులు నింపుకొనేవి.తర్వాత మొదలవుతుంది అండి అసలు కథ. చుట్టు పక్కల పచ్చని పొలాలు కనిపిస్తే చాలు,మొదట ఒక గొర్రె పరిగెడుతుంది.దానిని చూసి ఇంకో పది గొర్రెలు పరుగెడుతాయి.వాటిని చూసి మిగిలినవి అన్నీ పరిగెడుతాయి...వాటి దగ్గర మంచి మేత ఉన్నా సరే,దానిని వదిలేసి, అన్ని గొర్రెలు వెళ్లే వైపే పరుగెడుతాయి.మేము తరమడానికి వెళ్లే లోపు ముందున్న ఒకటో,రెండో గొర్రెలు మాత్రమే మేత మేసి ఉంటాయి.మిగతా గొర్రెలు ఏమి తినకుండా వెనుకకు తిరిగి వచ్చేస్తాయి. ఇందుమూలంగా నేటి యువతకు నేను చెప్పేది ఏమిటంటే,ఎవడో ఒకడు ఇంజనీర్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నాడనో, డాక్టర్ అయ్యి కోట్లు సంపాదిస్తున్నాడనో, మనం కూడా అలా డబ్బు సంపాదించాలని అనుకోకండి. పైన చెప్పిన కథలో గొర్రెలు తమ దగ్గర ఉన్న మంచి గడ్డిని వదిలేసి,అన్ని గొర్రెలు వెళ్లే వైపు పరుగులు పెట్టి చివరకు ఏది లేకుండా వెనుకకు తిరిగినట్టు,మనకు బాగా వచ్చిన,నచ్చిన పనిని వదిలేసి అందరూ పరిగెడుతున్న వైపు పరుగులు తీసి నిరుద్యోగులు గా మారకండి. తల్లిదండ్రులు కూడా ,మీ బంధువుల పిల్లలో లేక స్నేహితుడి పిల్లలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి బాగా డబ్బులు సంపాదిస్తున్నాడని,మీ పిల్లల ఆశక్తిని గుర్తించకుండా వాళ్ళను కూడా అమెరికాకు పంపాలని అనుకోకండి.చదువుని జ్ఞానానికే పరిమితం చేయండి,దాన్ని వృత్తి లా మార్చకండి.మనం చేసే పని పట్ల మనకు ఇష్టం ఉండాలి.లేదంటే దాని ఫలితం శూన్యం అవుతుంది.విద్యను బోధించే ప్రతి ఉపాధ్యాయుడు జీతం కోసం కాకుండా,తను నేర్చుకున్న విద్యను పది మందికి పంచాలి అనే ఆశక్తి తో ఉద్యోగం చేస్తే ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్యలు చేసుకునే వాడు కాదు, ఏ ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యేవాడు కాదు.ప్రతి ఒక డాక్టర్ డబ్బులకు ఆశపడకుండా,ఇష్టంతో డాక్టర్ అయ్యింటే,మంచి చికిత్స అందించి ఇంకా ఎంతోమంది ప్రాణాలు కాపాడేవారు.ప్రతి ఒక పోలీస్ లంచం తీసుకోకుండా న్యాయం కోసం పోరాడింటే,ఎక్కడా మోసాలు జరిగేవి కాదు. ప్రతి ఒక ఇంజనీర్ జీతం కోసం కాకుండా ఇష్టంతో పని చేసి ఉంటే,నిర్మించిన 2 వారాలలోనే బ్రిడ్జిలు,భవనాలు కూలేవి కాదు.ఇలా జీతం కోసం ఆశక్తి లేని ఉద్యోగాలు చేయడం వలనే విద్యలో నాణ్యత లేదు,వైద్యం లో మెరుగైన చికిత్స లేదు.ఇంతెందుకు మీరు ఆశక్తి లేకుండా చేసే ఉద్యోగానికి ఒక రోజైనా ఇష్టంతో వెళ్ళారా?అందుకే చెబుతున్నా మీ మనసుకు నచ్చిన వృత్తి ని మాత్రమే ఎన్నుకోండి. అందరూ సాప్ట్ వేర్ ఇంజినీర్లు,డాక్టర్లు అయ్యి బాగా సంపాదిస్తున్నారని మనం కూడా అటే వెళ్దాం అనుకొని,మీకు నచ్చిన పనిని వదిలేసి నిరుద్యోగులుగా మారకండి. బ్రతకడానికి ఎన్నో దార్లు ఉన్నాయి. ఉదాహరణకు మీకు నిజంగా ఒక టీచర్ అవ్వాలి అని ఉంటే, ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు.చిన్నగా ఒక టూషన్ పెట్టుకున్నా దాన్నీ అలా అలా డెవలప్ చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన వృత్తి ని వారు ఎన్నుకోండి. ఎవరి పైనా ఆధారపడకండి,దేని కోసం ఎదురుచూడకండి.ఎవడో పరిగెత్తే దారలో మీరు పరిగెత్తకండి.నేను చెప్పిన వాటిలో ఏవైనా తప్పులు ఉన్నా,ఎవరి మనసునైనా నొప్పించినా నన్ను క్షమించగలరని ఆశిస్తూ....
మీ అనిల్ అంబేద్కర్