రజనీ ప్రయాణం ఆగిపోయింది. ఆమె రామం కోసంచేసినయీ త్యాగపు విలువను ఎవరు గుర్తించలేకపోయారు, రజని కూడా మనస్సులో ఎంతో దుఃఖించిది. విదేశాలకు వెళ్ళే అవకాశం పోయిందని కాదు. జీవితంలో అంత వరకు ఎవరి ఇష్టాయిష్టాలను లెక్క చెయ్యని ఆమె వొక వ్యక్తి కన్నీటికీ, క్రోధానికి భయపడి అలాంటి సదవకాశాన్ని జారవిడుచుకుని, బలహీనతను ఆమె తన మనస్సులోనే గుర్తించుకుంది. ఆదే ఆమెను ఎందుకో కలవరపెట్టింది. మొదటి నుంచీ రామాన్ని ఆమె చులకనగా చూస్తూనే వుంది. మొదట్లో ఆమె యెడ అతను ప్రదర్శించిన క్రోధము, ఏవగింపు ఆమెలోని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. కాని ఆమె మనసే అతని యధికారాన్నంగీకరించేటప్పటికి ఆమె విచలితయింది. ఆమెరికన్ దంపతులిరువురు రజని నిశ్చయం విని ఎంతో దుఃఖించారు. ఆరోజల్లా అమె వారితోనే గడిపి, మరునాడు విమానాశ్రయానికి వెళ్ళీ వీడ్కోలు చెప్పింది. చిరకాలపరిచయం శాశ్వతంగా చీలి పోయేటప్పుడు పడే బాధ వారనుభవించారు.
"రజనీ! నీలాంటి యపూర్వ స్త్రీ పరిచయం కలిగినందుకు నేనెంతో సంతోషించాను మా దేశంవస్తారనీ, మన పరిచయం చిరకాలం వర్ధిల్లుతుందని కలలుకన్నాను. అవన్నీనాడు నేలకూలి పోయాయి. ఐనా వొక విషయం గుర్తుంచుకో రజనీ! నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కక్కడ స్వాగతం లభిస్తుంది. అక్కడ నీకు ఏవిధమైన కష్టము కలుగకుండా చూసుకునే భారం మాది" అన్నాడు డేవిడ్.
రజనికి కూడా ఆ మాటలు ఎందుకో బాధను కలిగించాయి. "నీకు కృతజ్ఞతనే పదంమీద అట్టే నమ్మకం లేదు డేవిడ్ కాని ఇప్పుడదే గత్యంత మేమోననిపిస్తోంది" అన్నది.
"ఇక మళ్ళీ మనం శేషజీవితంలో కలుసుకుంటామో లేదో తెలియదనుకుంటాను. పరిచయం ఒక రోజైనా స్మృతి జీవితాంతం వరకు నిలిచిపోతుంది. అప్పుడప్పుడు వుత్తరాలు వ్రాస్తూవుండు. పరదేశమయినా నీ వివాహానికి మేము తప్పక వస్తాము" అంది మేరి.
రజనీ నవ్వుతూ "పునర్జన్మంలో నాకు నమ్మకం లేదు. లేకపోతే మీ రాక కోసమయినా వివాహమాడుదును, సమయమంతా మించిపోయాక సంధికి వస్తానన్నారు మీరు" అంది.
YOU ARE READING
అప్రాశ్యులు
Dragosteఅరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగ...