విశాలకు డాక్టరు సనల్ కు గల పరిచయం దినదినాభివృద్ధి పొందింది. విశాలకు విడాకులివ్వబడ్డాయి. చట్టరీత్యా కూడా ఆమెకేమియిక బంధనాలు లేవు. బాహ్యంగా ఆమె అంగీకరించకపోయినా మానసికంగా ఆమె ఎంతో తేలికపడింది. ఇక ఆమె భవిష్యత్తు ఆమె యిష్టానుసారం దిద్దుకోవచ్చు. మాటి మాటికి, బొంబాయివైపు భయం భయంగా చూడనవసరం లేదు. ఇక భవిష్యత్ జీవితమంతా అక్కడే గడపడానికి నిశ్చయించుకుంది.రాత్రింబవళ్ళు విరామం లేకుండా ఆమె ఆ అనాధ బాలురను సహృదయుల చేసే ప్రయత్నంలో గడపసాగింది.సనల్ పరిచయమయిన దగ్గరనుంచే రహస్యంగా ఆమెలో కోరికలు తిరిగి మొలకలెత్తాయి. మొదటిలో ఆమె వాటిని అణచి వెయ్యిడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కాని ప్రకృతిని ఆమె జయించలేకపోయింది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే ఆశయంతో ఒకేచోట రాత్రింబవళ్ళు చేదోడు వాదోడుగా చాలాకాలం సంచరిస్తుంటే ప్రకృతి చూస్తూ వూరుకోదు, వారి హృదయాల్లో అనురాగపు బీజాలను నాటుతుంది. స్త్రీపురుషులకు మధ్య ఆకర్షణ సహజమైనది కాదు. అది సృష్టికే మూలకారణం అంటుంది రజని. విశాల తన హృదయ పరిస్థితిని అర్ధం చేసుకున్నప్పటి నుంచి సనల్ పట్ల కాస్త ముభావంగా సంచరించడం మొదలు పెట్టింది. ప్రతి రోజూ సాయంత్రం ఇరువురు కలసి షికారుకి వెళ్ళడం వారికి అలవాటయిపోయింది. కాని కొన్ని రోజులనుంచీ విశాల ఏదోవంక పెట్టి తప్పించుకుంటూ వచ్చింది. ఒంట్లో బాగుండటం లేదు విశ్రాంతి తీసుకుంటాననేది .
ఆరోజు సాయంకాలం సనల్ విశాల ఇంటికి వచ్చి తలుపుతట్టి తలుపు తెరచివుంది, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. విశాల వంటరిగా కూర్చుని కిటికీలో నుంచి పరధ్యానంగా బయటకు చూస్తూంది. విశాలా, అనే పిలుపు దగ్గరలో వినబడి త్రుళ్ళిపడింది.సనల్ ని చూచి వెంటనే లేచి నిలబడి కంగారుగా "మీరా?" అంది.
"అవును నేనే విశాలా, వంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు" అన్నాడు.
"విశాలా నేను డాక్టరునని మరచిపోయి మాట్లాడుతున్నావు ఏది నన్ను చూడనీయి" అని దగ్గరకు వచ్చి విశాల చెయ్యి పట్టుకున్నాడు.
YOU ARE READING
అప్రాశ్యులు
Romanceఅరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగ...