విశాల రాత్రింబగళ్ళు అక్కడ పిల్లలతోనే గడపసాగింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంవరకు వారికి ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పేది. ఆ తర్వాత వారి భోజనాలయిన పిదప దగ్గర కూర్చుని వారికి కథలు చెప్పుతూ నిద్ర పుచ్చేది. మనశ్శాంతికి ఆప్యాయంగా కౌగలించుకొని గడపిన దినం వృధాగా లేదనే గర్వంలో ఆమె నిద్రించేది జీవితంలో ఎన్నడని ఆమె అంత సుఖం అనుభవించలేదు. దీనికి ఇంకొక కారణం కూడా వుంది. ఇద్దరి ఆశయాలకు వొక్కటే , గమ్యస్థానం ...సునల్ తో స్నేహం దినదినం వర్థమానమైంది, తీరిక ఉన్నప్పుడల్లా విశాలవద్దకు వచ్చి ఆమెతో కాలంగడుపుతూ ఉండేవాడు. అతని సహృదయత, సరళ స్వభావము, స్వార్ధరహితం ఆమెలో ఒక విధమైన గౌరవ భావాన్నికలుగజేసాయి క్రమక్రమంగా ఈ స్నేహమే అనురాగపు బీజాలని వారి హృదయాలలో నాటింది. వారికి తెలియకుండానే హృదయాలు సన్నిహిత మయ్యాయి
సంధ్యాసమయాల్లోనూ, వెన్నెల రాత్రులలోను ఒకరి వద్దకు ఇంకొకరు బయలుదేరేవారు, దారి మధ్యలో కలుసుకొని దారితప్పి దగ్గరలోనే వున్న తోటలోనికి వెళ్ళి కూర్చుని, అనేక విషయాలను గురించి చర్చించేవారు. కాని ఎన్నడు స్వంత విషయాలను గురించి మాట్లాడుకోలేదు.
ఒకనాడు వారిరువురు మాట్లాడతూ మాట్లాడుతూ చాలాదూరం నడిచి వెళ్ళిపోయారు. మానవజీవితంలోని ఆశయాలు, ఆచరించవలసిన కర్తవ్యాలు, అదుపులో ఉంచవలసిన ఉద్రేకాలు, వీటిగురించి వారు చర్చించసాగారు.
"ఆశయాలను ఆచరణలో పెట్టడం కష్టమని నేను ఒప్పుకుంటాను సునల్ బాబూ! ఆశయాలుండి ఆచరణలో పెట్టలేకపోవడం ఆశయాలు లేకండా వుండటంకన్న యెంతో మేలు. ఎవరైనా నువ్వెందుకు జీవిస్తున్నావని అడిగితే తడుముకోకుండా అతడు సమాధానం చెప్పటానికి వీలవుతుంది" అంది. విశాల.
"కొంతవరకు నేను ఒప్పుకుంటాను, కాని ఆశయాలను మనస్సులో వుంచుకొని వాటికి విరుద్ధంగా సంచరించడం ఆత్మవంచన విశాలా! ఆశయాలను సాధించలేక పోవచ్చు. కాని వాటికోసం శక్తి వంచన లేకుండా కృషి చెయ్యడము ఆ వ్యక్తి కనీస ధర్మం. దానికి ఫలితంతో నిమిత్తం లేదు" అన్నాడు.
YOU ARE READING
అప్రాశ్యులు
Romansaఅరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగ...